ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎమ్మెల్యే కీలక సూచనలు

కలం, జగిత్యాల : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్ కుమార్ (Sanjay Kumar) సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే అత్యంత ముఖ్యమని పేర్కొంటూ పలు జాగ్రత్తలు పాటించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ఆయన హెచ్చరించారు.

విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గోడలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో పొలాల్లో పనులు చేయకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని వారు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే వాహనదారులు నీటితో నిండిన రహదారులపై వేగంగా ప్రయాణించకుండా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రభుత్వం, వాతావరణ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జగిత్యాల నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ప్రమాదం లేదా సహాయం అవసరమైన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు లేదా స్థానిక ప్రజాప్రతినిధులను వెంటనే సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>