కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లా కోస్గి మండలం తోగాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు అవసరమైన 209 ఎకరాల భూములు అప్పగించేందుకు రైతులు అంగీకరించినట్లు కలెక్టర్ సీహెచ్.ప్రియాంక తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో రైతులతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.
43 మంది రైతుల అంగీకారం..
మొదట కలెక్టర్ సమక్షంలో జిల్లా యంత్రాంగం నిర్ణయించిన పరిహారం రేటును రైతులు అంగీకరించలేదు. పరిహారం తక్కువగా ఉందని, పెంచాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం మార్కెట్ విలువకు అనుగుణంగా భూ పరిహారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో 43 మంది రైతులు సమ్మతి తెలుపుతూ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. మిగిలిన రైతులను కూడా ఒప్పించి భూములను అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తోగాపూర్ గ్రామ సర్పంచి హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం..
ఈ సందర్భంగా కొందరు రైతులు తమ మొత్తం భూమి భూసేకరణలోకి వెళుతోందని కలెక్టర్ ప్రియాంకకు వివరించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ముందుగా నష్టపరిహారం స్వీకరించి, మూడు రోజుల్లో సమ్మతి అవార్డుకు అంగీకారం తెలపాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
వాటికి కూడా పరిహారం..
భూమికి చెల్లించే నష్టపరిహారంతో పాటు చెట్లు, పంటలు, బోర్లు, షెడ్లు తదితర ఆస్తులకు కూడా నిబంధనల ప్రకారం అదనపు పరిహారం అందజేస్తామని కలెక్టర్ ప్రియాంక చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు సాధ్యమైన సహాయ చర్యలు, ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రఫిక్ , ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, తహసీల్దార్ బక్క శ్రీను, తోగాపూర్ రైతులు పాల్గొన్నారు.

