కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో చేపట్టిన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ట్రిపుల్ ఐటీ, జిల్లా పరిషత్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో భవన నిర్మాణ పనులపై సమీక్ష చేశారు.
కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ..
విద్యాసంస్థల్లో సివిల్ నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఖుష్బూ గుప్తా అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దాయింపల్లి, దేవరకద్ర నియోజకవర్గం దమగ్నాపూర్‌లో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల భవన నిర్మాణ పనుల స్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ కోసం స్థల సేకరణ, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కేజీబీవీల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మాణాలను ప్రాముఖ్యతతో తీసుకోవాలని ఆదేశించారు.
15 రోజుల్లో మళ్లీ సమీక్ష..
ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల తనిఖీల ఫొటోలను వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మరో 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికీ అన్ని పనుల్లో పురోగతి ఉండాలన్నారు. ఎంబీ నమోదు ప్రక్రియను నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా విద్యా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, కేజీబీవీ అధికారులు పాల్గొన్నారు.

