కలం, మెదక్ బ్యూరో: గురు పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్(Narayankhed)కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకులపై గురు-శిష్య సంప్రదాయాన్ని ప్రతిబింబించే వినూత్న లీఫ్ ఆర్ట్‌ను రూపొందించారు. గురువుకు శిష్యుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్న దృశ్యంతో పాటు, గురువు శిష్యునికి జ్ఞానోపదేశం చేస్తున్న మరో దృశ్యాన్ని రావి ఆకులపై అత్యంత నైపుణ్యంతో చెక్కి ఆకట్టుకున్నాడు.
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న విశిష్ట స్థానాన్ని, గురు-శిష్య పరంపర గొప్పతనాన్ని ఈ కళాఖండాల ద్వారా ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు శివకుమార్ తెలిపారు. ప్రకృతి ప్రసాదమైన రావి ఆకులను కళా మాధ్యమంగా ఎంచుకుని సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను ప్రజలకు చేరవేయడం తన లక్ష్యమని పేర్కొన్నారు.

