కలం, మెదక్ బ్యూరో : స్కూల్ యాజమాన్యం టీసీ (TC) ఇవ్వడం లేదని ఓ విద్యార్థిని తండ్రి పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో (Zaheerabad) చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణానికి చెందిన గోవర్ధన్ కుమార్తె మోక్షిత గత ఏడాది ఇండస్ యూనివర్సల్ స్కూల్‌లో (Indus Universal School) ఆరో తరగతి చదివింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో చదవమని డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, టీసీ ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని తండ్రి ఆరోపించారు.
తాము వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉందని, టీసీ ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందించలేదని గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు వర్కింగ్ డేస్ పూర్తయిన తర్వాతే టీసీ ఇస్తామని చెప్పి తనను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. దీంతో మంగళవారం పాఠశాల గేటు ముందు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగిన ఆయన.. తన సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళనతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం గేటు బయటకు వచ్చి గోవర్ధన్‌కు నచ్చజెప్పి టీసీ అందజేసింది. దీంతో ఆయన తన ఆందోళనను విరమించారు.

