కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లాలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ (Tapaspally Reservoir) లోకి నీటిపారుదల శాఖ అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. జనగామ జిల్లాలోని బొమ్మకూర్ రిజర్వాయర్ నుండి ఈ నీటిని పంపింగ్ ద్వారా తపాస్‌పల్లికి తరలిస్తున్నారు.
ఈ జలాల విడుదల వల్ల సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలతో పాటు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన వేలాది మంది రైతులకు సాగునీటి తిప్పలు తప్పనున్నాయి. పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందనుండటంతో ఆయా ప్రాంతాల రైతాంగంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల అంచనా ప్రకారం.. మరో 15 రోజుల పాటు నిరంతరాయంగా పంపింగ్ ప్రక్రియ కొనసాగితే తపాస్‌పల్లి రిజర్వాయర్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండితే ఈ వర్షాకాలం సాగు సీజన్‌కు నీటి కొరత ఉండదని, ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

