కలం, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు మంగళవారం జగిత్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎస్‌సీడీఓ, ప్రత్యేక అధికారి కె. రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జగిత్యాల అర్బన్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వి.విజయలక్ష్మి, జగిత్యాల అర్బన్ మండల పంచాయతీ అధికారి వాసవి, మండల పరిధిలోని సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సమీక్ష సమావేశంలో వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి కె.రాజ్‌కుమార్ సూచించారు.
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వి. విజయలక్ష్మి (MPDO Vijayalakshmi) మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్.నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాలని సంభందిత సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. అలాగే జలసిరి పనులను రాబోయే 10 రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులను కోరారు. గ్రామాభివృద్ధి దిశగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, తాగునీటి నిర్వహణ, గ్రామస్థాయి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

