కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేందుకు తీసుకొచ్చిన హైడ్రా (HYDRAA)పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం అక్కడి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు, నాలాలను హైడ్రా ద్వారా కాపాడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ. లక్షల కోట్ల విలువ గల కబ్జాకు గురైన భూమిని కాపాడమని తెలిపారు.
చెరువుల్ని కాపాడటమే హైడ్రా పని..
చెరువులు కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంటే, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని.. ప్రజలను విపత్కర సమయంలో రక్షించేందుకు హైడ్రా పనిచేస్తోందని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, పార్కులను కబ్జా చేస్తే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడటమేనన్నారు.
గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా..
తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) కొనియాడారు. హైడ్రా పనితీరుపై తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని.. దేశంలోనే హైడ్రాకు మంచి పేరు వచ్చిందన్నారు. తప్పుడు డాక్యుమెంట్ లతో కబ్జాదారులు కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. భూ కబ్జాదారులే హైకోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ధిక్కరణ అంటున్నారని మండిపడ్డారు. గతంలో సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని.. ఆరోజు అవన్నీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై సెటైర్లు..
హైడ్రాను ఆపేందుకు వేస్తున్న పిటిషన్ లపై న్యాయస్థానాలను ఆశ్రయించి ఎదుర్కొంటామని సీఎం వివరించారు. బతుకమ్మ కుంట (Bathukamma Kunta)లో 10 ఎకరాలు కబ్జా పెట్టిన కేసీఆర్ కు, తన పర్యటన సందర్భంగా పూల వర్షం కురిపించారని చెప్పుకొచ్చారు. 10 ఎకరాలు కబ్జా పెట్టినోడు ‘పూల వర్షం ఏం కర్మ.. కనక వర్షం కూడా కురిపించవచ్చు’ అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీపై ఫైర్..
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య తెలంగాణాలో ఇక ఉండదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆ సంవత్సరమే చెల్లిస్తామని అన్నారు. రూ.8 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నదేనని చెప్పుకొచ్చారు. ఏపీలో 100 శాతం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వాత బీజేపీ నేతలు రాంచందర్ రావు, ఆర్ కృష్ణయ్యలు తెలంగాణ గురించి మాట్లాడాలని బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు.
దొంగలు, కబ్జా పెట్టినోళ్లు, బీఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను తీసివేయాలని అంటున్నారని సీఎం విమర్శించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ అధికారమని.. ఆ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని ఫైర్ అయ్యారు.
Read Also: పేపర్ల లీకేజీలపై శిక్షలు ఎక్కడ?: ప్రియాంక గాంధీ
Follow Us On: Instagram

