‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్.. రైతులకు కలెక్టర్ కీలక సూచనలు

కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్(వై) గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ (Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొని మాట్లాడారు.

హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్‌గా కార్యక్రమాన్ని (Rythu Nestham) ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యాన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాలు నిండితేనే సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల రైతులు సాగునీటిపై ఆశలు పెట్టుకోకుండా కందులు, మినుములు, వేరుశెనగ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా వనపర్తి వేరుశెనగకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం రైతులకు మినుముల విత్తనాలను పంపిణీ చేసిన కలెక్టర్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రశంసా పురస్కారాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యాన శాఖ అధికారి విజయభాస్కర్, గ్రామ సర్పంచి నికిత, తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Read Also: చెరువులు కబ్జా చేస్తే వదిలిపెట్టం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సీరియస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>