కొండగట్టు గిరి ప్రదక్షిణకు తరలిరండి: ఎమ్మెల్యే మేడిపల్లి

కలం, కరీంనగర్ బ్యూరో: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరుగాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆలయంలో రేపు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం(MLA Medipally) తెలిపారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకల జనుల సంక్షేమం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రైతుల అభివృద్ధి, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొండగట్టు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా పచ్చని ప్రకృతి అందాలకు నిలయమని అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టు అంజన్న దర్శనానికి వస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నరసింహమూర్తి, శివుని రూపాల కలయికతో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రేపు ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి రాజకీయ కోణంలో చూడకుండా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావించాలని అన్నారు.

నారాయణపూర్ రిజర్వాయర్‌పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు

నారాయణపూర్ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Satyam) తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ముంపునకు గురయ్యే ఇళ్లకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన 40 ఇళ్లకు పరిహారం ఇవ్వలేదని, తాము చొరవ తీసుకొని వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకువచ్చి ప్రాజెక్టు, నిర్వాసితుల సమస్యలపై వివరించామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, చొప్పదండి సహకార పరపతి సంఘం చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గంగన్న, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: చెరువులు కబ్జా చేస్తే వదిలిపెట్టం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సీరియస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>