బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలి: వాకిటి శ్రీధర్

కలం, వనపర్తి: తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల (TGSRTC Retired Employees) కు 2017–2021 కాలానికి సంబంధించిన ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆగస్టు 4న హైదరాబాద్‌లోని బస్ భవన్ వద్ద నిర్వహించే మహా ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె. సత్యన్న, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాంచంద్రారెడ్డితో కలిసి మాట్లాడిన ఆయన, విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన, భద్రత కోసం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో భార్యాభర్తలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రోగులకు రెండు నెలలకు సరిపడా మందులు అందించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ ముట్టడి అనంతరం కూడా యాజమాన్యం స్పందించకపోతే ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రామ్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్, ఎస్.ఎం.అలి, లక్ష్మీనారాయణ, స్వామి గౌడ్, గోపాల్‌రెడ్డి తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>