కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. డెహ్రాడూన్-పాంటా సాహిబ్ జాతీయ రహదారిపై ప్రేమ్‌నగర్ సమీపంలోని నందా కీ చౌకీ వద్ద కొత్తగా పునర్నిర్మించిన బ్రిడ్జ్ (Dehradun Bridge) వర్షానికి కుంగిపోయింది. సుమారు 16 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించి, కేవలం 16 రోజుల క్రితమే ప్రజల రవాణాకు అందుబాటులోకి తెచ్చిన ఈ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు మట్టి కొట్టుకుపోవడంతో భారీ గుంత ఏర్పడింది. టోన్స్ నదిపై ఉన్న ఈ కీలకమైన వంతెన దెబ్బతినడంతో వికాస్‌నగర్, హిమాచల్ ప్రదేశ్ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
గత ఏడాది సెప్టెంబర్‌లో సంభవించిన వరదలకు పాత వంతెన దెబ్బతినగా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వేగంగా పనులను పూర్తి చేసి జూలై 12న కొత్త బ్రిడ్జ్ ద్వారా రవాణాను ప్రారంభించింది. అయితే, భారీ వర్షానికి ఈ వంతెన ఇలా ప్రమాదకరంగా మారడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ప్రేమ్‌నగర్ పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా దృష్ట్యా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తూ, యుద్ధప్రతిపాదికన మరమ్మతులను చేపట్టారు.

