కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు (ED Raids Hyderabad) నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఏడు చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు లింకుల ఆధారంగా బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులో హైదరాబాద్ పోలీసులు కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ కేసులో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. నిందితులకు ఉన్న అంతరాష్ట్ర సంబంధాలు, డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ఈ సోదాలు అత్యంత కీలకంగా మారాయి.

