కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో శాసన సభ ఎన్నికల వేళ ఆందోళనలు హింసాత్మకంగా (POK Protest) మారుతున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగలోకి దిగిన భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిరసనల్లో ఏడుగురు మహిళలతో సహా 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో పలువురు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
పీవోకేలో స్థానిక శాసనసభ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికంగా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను పాకిస్తాన్‌కు తరలిస్తూ, తమపై అధిక విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారని పీవోకే ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం, పాలనలో సంస్కరణలు, స్థానిక హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లతో ఆందోళనలు మరింత ఉధృతంగా మారాయి.

