సూర్యాపేటలో సీఎంఆర్ దందా.. పరారీలో టీఆర్పీ నేత!

కలం, సూర్యాపేట బ్యూరో: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ (Vatte Janaiah Yadav) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో భూ వివాదాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, తాజాగా కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR) బియ్యం అక్రమాల కేసులో బుక్కయ్యారు. విజిలెన్స్ విచారణలో ఆయనకు చెందిన రైస్ మిల్లుల నుంచి భారీ స్థాయిలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వట్టే జానయ్య యాదవ్, ఆ సమయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS) చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం రాజకీయ విభేదాల కారణంగా బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్పీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జానయ్య ఉన్నారు. ప్రస్తుతం బియ్యం స్కామ్ లో జానయ్య పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో ఆయనపై ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) యాక్ట్ నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సివిల్ సప్లై మంత్రి సొంత జిల్లాలోనే పెండింగ్

సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నల్లగొండ ప్రాంతాలు రాష్ట్రంలోనే ప్రధాన రైస్ మిల్లింగ్ కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఆయా ప్రాంతాల్లో ధాన్యం వ్యాపారం రూ. వేల కోట్లలో సాగుతోంది. అయితే, జిల్లాలో ఇప్పటికీ వందల కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మిల్లర్లు ఐదు నుంచి ఆరేళ్లుగా సీఎంఆర్ బకాయిలను చెల్లించకపోయినా, అదే మిల్లులకు ప్రతి ఏడాది ధాన్యం కేటాయింపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డీఫాల్టర్ జాబితాలో ఉన్న కొన్ని మిల్లులు పేర్లు మార్చి తిరిగి ధాన్యం కేటాయింపులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా మంత్రి ఉత్తమ్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ కోణంలోనూ చర్చ

వట్టే జానయ్య యాదవ్‌కు చెందిన మిల్లులపై తీసుకున్న చర్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. జిల్లాలో పలువురు మిల్లర్లు భారీ స్థాయిలో సీఎంఆర్ బియ్యాన్ని పెండింగ్‌లో ఉంచినా, కొందరిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, సీఎంఆర్ అక్రమాలు మిల్లర్లతో పాటు పర్యవేక్షణలో విఫలమైన అధికారుల పాత్రను కూడా పరిశీలించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రికవరీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విజిలెన్స్ దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రూ.కోట్లలో అక్రమాల గుర్తింపు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంలలో వట్టే జానయ్య యాదవ్‌కు చెందిన వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వజ్ర రైస్ కార్పొరేషన్‌లో 11,073 టన్నులు, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లో 18,114 టన్నులు.. మొత్తంగా 29,187 టన్నుల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మొత్తంగా సుమారు రూ.69 కోట్ల నుంచి రూ.73 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. వట్టే జానయ్య యాదవ్, ఆయన కొడుకుపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>