కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ అత్యున్నతాధికారి. వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులందరికీ ఆయన హెడ్. సీఎం అందుబాటులో లేనప్పుడు అన్ని నిర్ణయాలూ చీఫ్ సెక్రటరీ తీసుకుంటారు. ఆ ఉన్నతాధికారి కోసం ప్రభుత్వం అధికారికంగా క్వార్టర్ నిర్మించినా ఇప్పుడు అది అందుబాటులో లేకుండా పోయింది. బంధువుల ఇండ్లలో, గెస్ట్ హౌస్ లలో సీఎస్ సంజయ్ జాజు ఉండాల్సి వస్తున్నది.
ప్రభుత్వం అఫీషియల్‌గా బంగళా కేటాయించినా ఆయన అవసరాలకు ఉపయోగపడటం లేదు. ప్రస్తుతం అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నందున చీఫ్ సెక్రటరీకి ఉండడానికి ఇల్లు లేకుండాపోయింది. దాదాపు నాలుగు వారాలుగా ఆయన ఎక్కడ ఉంటున్నారనేది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా తెలియదు. ప్రభుత్వానికి హెడ్‌గా ఉండే చీఫ్ సెక్రటరీకి సర్కారు బంగళా ఉన్న అవసరాలకు ఉపయోగపడకపోవడం అవమానకరమైన అంశమనే చర్చ సచివాలయ వర్గాల్లో మొదలైంది.
సొంతిల్లు లేకపోవడంతో సీఎస్‌కు చిక్కులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju)కు ప్రస్తుతం అధికారిక నివాసమే లేకుండాపోయింది. సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనకు హైదరాబాద్‌లో సొంతిల్లు లేదు. ఈ నెల 1వ తేదీన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న ఆయన కొంతకాలం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు లోక్‌భవన్ సమీపంలోని దిల్‌ఖుషా గెస్ట్ హౌజ్‌కు మారారు. అదే ఆయన తాత్కాలిక నివాసమైంది.
చీఫ్ సెక్రటరీకి అఫీషియల్‌గా కుందన్‌బాగ్‌లో బంగళా ఉన్నప్పటికీ ఐదారేండ్లుగా అది ఖాళీగా ఉండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి చీఫ్ సెక్రటరీగా రాజీవ్‌శర్మ, ఆ తర్వాత ఎస్కే జోషి కుందన్‌బాగ్‌లోని అధికారిక క్వార్టర్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న సోమేశ్ కుమార్ అత్తాపూర్‌లోని సొంతింట్లో ఉన్నారు. శాంతికుమారికి ప్రశాసన్ నగర్లో సొంతిల్లు ఉండడంతో అక్కడ ఉన్నారు. ఆ తర్వాత రామకృష్ణారావు సైతం ఈ బంగళాలో లేరు.
మంత్రుల క్వార్టర్లను తీసుకోని ఉత్తమ్
మంత్రులందరికీ ప్రభుత్వం మినిస్టర్ క్వార్టర్లు కట్టించింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం అక్కడ అలాట్మెంట్ ఉంది. కానీ ఆయన దాన్ని తీసుకోకుండా సొంతింట్లో ఉన్నారు. దాదాపు ఐదారేండ్లుగా కుందన్‌బాగ్‌లోని సీఎస్ అధికారిక నివాసం వినియోగంలో లేకపోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసు అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మినిస్టీరియల్ సిబ్బంది అందులో ఉంటున్నారు. చీఫ్ సెక్రటరీకి సిటీలో సొంతిల్లు లేదని తెలిసినా, బంధువుల ఇంట్లో, గెస్ట్ హౌజ్‌లో ఉంటున్నారని తెలిసినా మంత్రి ఖాళీ చేయలేదన్న మాటలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మంత్రులకు ఇండ్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా తాజా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చీఫ్ సెక్రటరీ అవసరం కోసం ఆ బంగళాను కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే నాలుగు వారాలు దాటినందున కుందన్‌బాగ్ క్వార్టర్ అందుబాటులోకి వస్తుందా? లేక ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి ఉంటుందనే అనేది ఆసక్తకరంగా మారింది.
గెస్ట్ హౌస్ లో తాత్కాలిక బస
హైదరాబాద్‌లో సొంతిల్లు లేక చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ప్రస్తుతం దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో తాత్కాలికంగా ఉంటున్నారు. కుందన్‌బాగ్ లో సీఎస్ కోసం కేటాయించిన అధికారిక బంగళాను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌గా వినియోగిస్తుండటంతో అది సీఎస్‌కు అందుబాటులో లేదు. రాష్ట్ర అత్యున్నత అధికారి అయిన చీఫ్ సెక్రటరీకి అధికారిక నివాసం లేకపోవడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

