కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవం (Simhachalam Giri Pradakshina) అత్యంత భక్తిశ్రద్ధలతో నేడు ప్రారంభం కానున్నది. ఈరోజు ఉదయం కొండ దిగువన ఉన్న తొలిపావంచ (మొదటి మెట్టు) నుంచి భక్తులు ఈ పవిత్ర యాత్రను మొదలుపెట్టనున్నారు. సింహగిరి చుట్టూ దాదాపు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ భారీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా ఈరోజు విశాఖ పరిధిలోని 221 విద్యాసంస్థలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 50 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, తొక్కిసలాట లాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి కొండపైకి ప్రైవేట్ వాహనాల అనుమతిని పూర్తిగా నిరాకరించారు. అలాగే భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు సజావుగా సాగేలా చూడటానికి ఈరోజు, రేపు స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవలను ఆలయ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

