కలం, ఖమ్మం బ్యూరో: ఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలలో అంగీకరించిన అంశాలను యాజమాన్యం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్–సీఐటీయూ (RTC SWF- CITU) నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం, పనిభారం తగ్గింపు, పెంచిన అలవెన్సుల అమలు తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులు (RTC Workers) సోమవారం ఖమ్మం డిపో (Khammam Depot) ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం లింగమూర్తి, పిట్టల సుధాకర్ మాట్లాడుతూ, ఈడీల కమిటీతో జరిగిన చర్చలలో అంగీకరించిన అంశాలను అమలు చేయడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని ఆరోపించారు. దీంతో అలవెన్సుల రూపంలోనే కార్మికులు ప్రతి నెల రూ.3 కోట్ల మేర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒప్పందం ప్రకారం 80 శాతం పెంచిన అలవెన్సులను జులై నెల జీతం నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ‘బ్రెడ్ విన్నర్ స్కీమ్’ కింద పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, శాఖాపరమైన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రత కమిటీని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు, 2019 సమ్మె సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులతో జరిగిన చర్చల ఫలితాలను యాజమాన్యం తక్షణమే అమలు చేసి ఆర్టీసీలో సుస్థిరమైన పారిశ్రామిక వాతావరణం నెలకొల్పాలని కోరారు. అనంతరం డిపో కార్యదర్శి గుగ్గిళ్ల రోశయ్య ఆధ్వర్యంలో నాయకులు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తోకల బాబు, డి. సరిత, జి. బాబు, కాంతారావు తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

