కలం, నిర్మల్ : ముధోల్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని కోరుతూ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (MLA Pawar Ramarao Patel) సోమవారం హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని భైంసా ఏరియా ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
అలాగే భైంసాలో 100 పడకల ప్రత్యేక మెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భైంసా ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్‌ను ప్రస్తుతం ఉన్న ఐదు పడకల నుంచి పది పడకలకు విస్తరించి మరింత మందికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుబీర్ మండలంలో గ్రామాలు ఎక్కువగా ఉండటంతో పాటు గిరిజన జనాభా అధికంగా ఉన్నందున అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు.
ముధోల్ ఆసుపత్రి భవన నిర్మాణం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు తదితర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

