ఓటరు ఫారాల నుంచి నీటి సంరక్షణ వరకు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం , మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణను వేగవంతం చేసి, గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ( Khushboo Gupta ) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) వెంటనే అందజేయాలని సూచించారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కాకపోవచ్చని, దీంతో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

ప్రజావాణిలో 140 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి అర్జిదారుల నుంచి వినతులు స్వీకరించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయం, పౌరసరఫరాలు, భూ సర్వే, గృహ నిర్మాణం, విద్యుత్, వైద్యం, విద్య, పోలీస్, అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 140 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులను అత్యవసరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు నెలల్లో సుమారు 1,400 ఫార్మ్ పాండ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే 83 వేల వ్యక్తిగత సోక్‌పిట్లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల్లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద శానిటరీ కాంప్లెక్స్‌లు, డ్రైనేజ్ సోక్‌పిట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 35 లక్షల మొక్కల నాటకం లక్ష్యాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి‌కి సన్మానం

ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె. రవీందర్‌ను కలెక్టర్ ఖుష్బూ గుప్తా శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. సుమారు 37 ఏళ్ల ప్రభుత్వ సేవలో ఆయన సమర్థవంతంగా పనిచేసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, ప్రభుత్వానికి సమాచార పంపిణీ, జనగణన కార్యక్రమాల నిర్వహణలో విశేష సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, డి.ఆర్. ఓ నిర్మల భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాం రెడ్డి, జడ్.పి.సి. ఈ. ఓ వెంకట రెడ్డి, డి ఆర్.డి. ఓ నర్సింహులు,కలెక్టరేట్ ఏ.ఓ. సువర్ణ రాజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>