కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ నగర్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ప్రజలకు మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గొల్లబండ తాండాలో ముడా నిధులు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన మల్టీ పర్పస్ షెడ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అదే విధంగా ముడా నిధులతోనే రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఎంపిపిఎస్ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించి, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాలకు త్వరలోనే నూతన భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం వీరన్నపేటలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
పేదలకు గృహ వసతి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు యెన్నం గొల్లబండ తాండాలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు, విద్యా సంస్థలు, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సమగ్ర పురోగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి.వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు చలువగాలి శ్రీనివాస్, తాహెర్, మోసిన్, రమేష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఖాజా పాషా, సల్మాన్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.

