కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఆదేశించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Regalla PHC) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు మరుగుదొడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం వైద్యాధికారులతో సమావేశమై ప్రతిరోజు నమోదవుతున్న ఓపీ వివరాలు, గత పది రోజుల్లో వచ్చిన జ్వర కేసుల సంఖ్యపై ఆరా తీశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జ్వర లక్షణాలతో వచ్చే రోగులకు వెంటనే రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. గ్రామాలలో వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రక్త పరీక్షల విభాగం, మందుల నిల్వ గదిని పరిశీలించిన కలెక్టర్.. మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పాము కాటు బాధితులకు అవసరమైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లను తగిన మోతాదులో నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు.
విధుల నిర్వహణలో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలోని ఆయుష్ క్లినిక్‌ను సందర్శించారు. తనిఖీ ముగిసిన తర్వాత రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో విశ్వాసం పెరిగేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

