సుడా చైర్మన్ పదవిపై మాదిగ సంఘాల డిమాండ్

కలం, కరీంనగర్: శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ పదవిని ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ సంఘాల ప్రతినిధులు (Madiga Leaders) కోరారు. సామాజిక సమీకరణలు, జనాభా ప్రాతిపదికన ఈ పదవిలో మాదిగలకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో (Karimnagar) నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం మాజీ కన్వీనర్ కనకం విద్యాసాగర్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోస్కి శంకర్ మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో సుడా చైర్మన్ పదవిని వెలమ సామాజిక వర్గానికి కేటాయించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించిందని వారు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం దృష్ట్యా ఈసారి మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. గత శాసనసభ ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి, పార్లమెంట్ ఎన్నికలలో  వెలమ సామాజిక వర్గానికి, ఎమ్మెల్సీ ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని పేర్కొంటూ, పార్టీకి అనాదిగా అండగా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

కరీంనగర్ జిల్లాలో మాదిగ సామాజిక వర్గ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవులు, పాలనలో అవకాశాలు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 60 వేలకుపైగా మాదిగ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం వారికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మాదిగ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.

శాసనసభ ఎన్నికల సమయంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో 57 వేలకు పైగా మాదిగ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చెబుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సూత్రాలను అమలు చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, రావణ్, కొయ్యడ వినోద్, అనిల్, సురేష్, వాసాల మనోహర్, సతీష్, శంకరయ్య, కొమ్ము బాబు, మాతంగి విష్ణు, రాజు, కనకం కుమార్, గాలిపల్లి ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>