అభివృద్ధి పనుల్లో నాణ్యతే లక్ష్యం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో: నగరంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఆదేశించారు. సోమవారం ఖమ్మం (Khammam) నగర పాలక సంస్థ పరిధిలోని 43వ డివిజన్‌లో రూ. 61.50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి పని పదికాలాల పాటు మన్నికగా ఉండేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ప్రభుత్వ నిధులను పూర్తి పారదర్శకంగా వినియోగించాలని స్పష్టం చేశారు. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఈ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పనులు మరింత నాణ్యతగా పూర్తవుతాయని పేర్కొన్నారు.

​రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, ఖమ్మం నగర పురోగతికి వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని, నగరంలో విశాలమైన రహదారులు, మెరుగైన వసతులు కల్పించడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు.

​ఇదే క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి గుర్తుచేశారు. పరిశుభ్రత వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>