కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేసిన పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ ఊపందుకున్నది. పేపర్ లీకేజీలు జరిగిన రాష్ట్రాల్లోనూ సీజేపీ ఉద్యమం మొదలుపెట్టాలనే ఆహ్వానం వస్తున్నది. పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో.. ఆయా రాష్ట్రాల్లోనూ సీజేపీ ఆందోళనలు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. కేంద్ర పరీక్షల లీకేజీలపై ఆందోళన చేపట్టిన సీజేపీ.. రాష్ట్ర పరీక్షల లీకేజీలపై మాత్రం ఎందుకు పోరాటం చేయదనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ నేపథ్యంలో సీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? రాష్ట్రాల్లోనూ ఉద్యమం స్టార్ట్ చేస్తుందా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రక్షాళన కోసం పోరాడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అందరి చూపు పంజాబ్‌పైనే..
ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పలు పేపర్లు లీక్ అయినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్‌తో పాటు గ్రూప్ బీ, ఫార్మాసిస్ట్ తదితర రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో పంజాబ్ విద్యా శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం సీజేపీ పోరాటం మొదలుపెట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇదే విషయమై సీజీపీ ప్రతినిధులను మీడియా ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి, కొంత రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించాం. మేం దాదాపు రెండు నెలలుగా జంతర్ మంతర్‌లోనే ఉన్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం పోరాడుతూనే ఉంటాం” అని వెల్లడించారు.
పంజాబ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలోనూ పేపర్ లీకేజీలపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ పేపర్ లీకేజీలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లోనూ సీజేపీ ఆందోళనలు చేయాలని.. రాష్ట్ర విద్యా వ్యవస్థల్లో సంస్కరణలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రక్షాళన కోసం పోరాడాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఒక్క పేపర్ లీక్ కాలేదు: పంజాబ్ సీఎం
పంజాబ్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో మా ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నది. ఈ కాలంలో ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాలేదు. అటు విద్యార్థుల పరీక్షలు, ఇటు పోటీ పరీక్షల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే ఇటీవల మాస్ కాపీయింగ్ చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం రావడంతో అధికారులు రంగంలోకి దిగి, ఆ కుట్రను ఛేదించారు.
బ్లూటూత్ పెన్నుల ద్వారా ప్రశ్నాపత్రాలను డిజిటల్‌గా స్కాన్ చేసి బయటకు పంపి, ఆపై బయటి నుంచి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పరీక్ష ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లోనే లోపల కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులతో పాటు, ఒక్కో పేపర్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తూ బయట నుంచి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న సూత్రధారులను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 21 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించాం” అని వెల్లడించారు.
ఇది ఆరంభమే: దీప్కే
ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉన్నదని సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అన్నారు. ‘‘ఇది ముగింపు కాదు. కేవలం ఆరంభమే. ఇంకా చాలా పెద్ద ప్రయాణం చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం, మా ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో నిరసన విరమించాం. కానీ ఇది ముగింపు కాదు.. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. గత 37 రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు.
రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయం లేచిన తర్వాత సాయంత్రం వరకు ఏమవుతుందో అనే టెన్షన్ లేకుండా ఉండగలుగుతున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దేశం కోసం మీరు చేసిన త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరి మద్దతు వల్లే ఈ ఉద్యమం విజయవంతమైంది. మమ్మల్ని విమర్శించిన వాళ్లకు ధన్యవాదాలు. మీ విమర్శలే మమ్మల్ని మరింత మెరుగ్గా పని చేసేలా చేశాయి’’ అని పేర్కొన్నారు.

