కలం, వెబ్డెస్క్: అస్సాంలో వరదలు (Assam Flood) తీవ్ర బీభత్సం సృష్టించాయి. తాజాగా పరిస్థితులు మెరుగుపడుతున్నా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 68కి చేరింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక బులిటెన్ ప్రకారం ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 5.24 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. చరైదేవ్, గోలాఘాట్, జోహాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో 5,24,700 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చరైదేవ్లో అత్యధికంగా 1.9 లక్షల మంది ప్రభావితం కాగా, నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 354 సహాయ శిబిరాల్లో 37,724 మంది తలదాచుకుంటున్నారు. బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.

