కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ప్రవాహం ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 16.1 అడుగులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరికొంత పెరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం నీటిమట్టం 18 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం భద్రాచలం పట్టణానికి గానీ, పరిసర లోతట్టు ప్రాంతాలకు గానీ ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. నీటిమట్టం ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకోలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

