అశ్వాపురంలో ప్రేమ వివాదం.. యువతి ఆందోళన

కలం, ఖమ్మం బ్యూరో: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వాపురంలో (Ashwapuram)  కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు, కట్నం ఆశతో తనను వదిలేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన కళ్యాణి, అదే మండలానికి చెందిన నూకల నవీన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నవీన్ తనను పలు ప్రాంతాలకు, దేవాలయాలకు తీసుకెళ్లాడని కళ్యాణి తెలిపింది.

అయితే ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో తనను దూరం చేసుకునేందుకు నవీన్ ప్రయత్నించాడని ఆరోపించింది. ఈ నెల 4వ తేదీన తనను ఓ గదికి తీసుకెళ్లి, తనకు తెలియకుండా ఇద్దరి మధ్య ఉన్న కాల్ రికార్డింగ్‌లు, మెసేజ్‌లు, ఫొటోలు సహా ఫోన్‌లోని కీలక సమాచారాన్ని తొలగించాడని పేర్కొంది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించి తనను రైలులో పంపించి, మరుసటి రోజు వస్తానని చెప్పాడని బాధితురాలు తెలిపింది. కానీ మరుసటి రోజే నవీన్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసి తీవ్ర షాక్‌కు గురయ్యానని చెప్పింది.

ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదైనప్పటికీ నవీన్, అతని కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి అశ్వాపురం మండలం కాలువ బజార్‌లోని నవీన్ ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. తన వద్ద ఉన్న ఆధారాలను పక్కా ప్రణాళికతో తొలగించి మోసం చేశారని, తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>