కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట (Dammapeta) మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన(Tractor Accident) ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దమ్మపేట మండలం మొండివర్రే గ్రామం సమీపంలో వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన బెజవాడ ప్రేమ్ కుమార్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేతికి అందిన వయసులో ప్రేమ్ కుమార్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో భార్యాపిల్లల రోదనలు స్థానికులను కలచివేశాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: స్క్వాష్‌లో భారత్ సత్తా.. అనహత్‌కు గోల్డ్ మెడల్
Follow Us On: Instagram

