కలం, ఖమ్మం బ్యూరో : కాళ్లకి తగిలిన చిన్న గాయం.. చికిత్స కోసం ఆస్పత్రి తలుపు తడితే, ఆ కుటుంబానికి మిగిలింది కన్నీళ్ల కాష్టం!. ఇద్దరు పసిపిల్లలకు తల్లి ప్రేమను, ఊరి ప్రజలకు ఒక మంచి నాయకురాలిని దూరం చేసిన ఈ దారుణం వెనుక అసలేం జరిగింది? . నిప్పుల గుండంగా మారిన భద్రాచలం (Bhadrachalam) ఆస్పత్రి ఘటన వెనుక కారణాలేంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు సిడెం వెంకటరమణ (34). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోర (ఎస్సీ కాలనీ) గ్రామానికి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆమె కేవలం ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా, ఊరి ప్రజల కష్టసుఖాల్లో ముందుండే మంచి గిరిజన (కోయ) నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇంట్లో ఇద్దరు పసిపిల్లలు, భర్తతో ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోని రీతిలో కాలు గాయం రూపంలో ఒక కష్టం వచ్చింది. కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకి తీవ్ర గాయమవ్వగా, గతంలో అమర్చిన రాడ్‌ను తొలగించుకోవడానికి, తదనంతర చికిత్స కోసం ఆమె భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న ‘మిమ్స్ మల్టీస్పెషాలిటీ’ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పూర్తయ్యాక సంతోషంగా ఇంటికి తిరిగొస్తుందనుకున్న కుటుంబ సభ్యులకు అక్కడ ఊహించని దృశ్యం ఎదురైంది. ఆస్పత్రిలో శస్త్రచికిత్స, వైద్యం అందించే క్రమంలో వెంకటరమణ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
అర్హత లేని సిబ్బందితో వైద్యం చేయించడం, వికటించిన ఇంజెక్షన్లు ఇవ్వడమే ఈ దుస్థితికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో భద్రాచలం ఆస్పత్రి వర్గాలు ఆమెను ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించాయి. కానీ విధి వక్రీకరించి అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ తుదిశ్వాస విడిచారు.
పసిపిల్లలను తల్లికి దూరం చేసి, ఒక యువ ప్రజాప్రతినిధి ప్రాణాలను బలితీసుకున్నారనే వార్త వినగానే దంతెలబోర గ్రామం దిగ్భ్రాంతికి గురైంది. వెంకటరమణ మరణవార్తతో భద్రాచలం పట్టణంలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. డాక్టర్ మోహన్ రావు నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమంటూ సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో బంధువులు, గ్రామీణులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. కన్నుల ముందే కడతేరిన తమ మనిషిని చూసి ఆక్రోశం, ఆగ్రహంతో రగిలిపోయిన కొందరు వ్యక్తులు శనివారం ఆస్పత్రి రిసెప్షన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అక్కడున్న కుర్చీలు, టేబుళ్లు దగ్ధమవ్వగా… ఆస్పత్రి సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ, నిర్లక్ష్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రిపై కలెక్టర్, డీఎంహెచ్ఓ తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, గిరిజనులకు వైద్యం అందించడంలో మానవత్వంతో వ్యవహరించాలని, లోపాలుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సంతాపాన్ని ప్రకటిస్తూ, ప్రజాసేవలో ముందంజలో ఉన్న యువ నాయకురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులు కేవలం లాభాపేక్షతోనే కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలని ఈ ఘటన నొక్కిచెబుతోంది. ఆపదలో ఉన్న రోగికి అందించే చికిత్సపై బంధువులకు ఎప్పటికప్పుడు పారదర్శకమైన సమాచారం అందించకపోతే, ఇలాంటి అనర్థాలు, అపోహలు ఎంతటి విధ్వంసానికి దారితీస్తాయో భద్రాచలం ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది. ఒక యువ సర్పంచ్ లేని లోటు ఆ కుటుంబానికి, దంతెలబోర గ్రామానికి ఎప్పటికీ తీరనిది.

