కలం, వెబ్‌డెస్క్: పతకాల వేటకు సిద్ధమైన భారత జట్టుకు ఇప్పుడు చలి, వర్షాలు కొత్త సవాల్‌గా మారాయి. దీంతో అథ్లెట్లు అనారోగ్యానికి గురికాకుండా ఐఓఏ వైద్య బృందం కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. స్కాట్లాండ్ (Scotland)లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో చలి, వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో భారత బృందం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దీవాలా అథ్లెట్లకు కీలక సూచనలు చేశారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లొద్దని, వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఇదే కారణంగా వెంటనే పోటీల్లో పాల్గొనాల్సిన అథ్లెట్లను ప్రారంభ వేడుకలకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెద్ద టోర్నీల్లో అథ్లెట్లకు ప్రధాన సమస్యగా మారుతాయని చెప్పారు. అయితే ప్రస్తుతం ఏ జట్టులోనూ అలాంటి పరిస్థితి లేకపోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. చేతులను శుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వైరస్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించారు.
అలాగే అథ్లెట్ల కోసం గేమ్స్ విలేజ్‌లో ప్రత్యేక రికవరీ సెంటర్, అవసరమైన వైద్య పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. అథ్లెట్లకు ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని, వారు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ఆటపై పూర్తిగా దృష్టి పెట్టేలా చర్యలు తీసుకున్నామని డాక్టర్ పర్దీవాలా తెలిపారు.

