కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ విస్తరణ అత్యవసరమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 3వ సీఎస్ఆర్ సమ్మిట్ కాన్ఫరెన్స్ & అవార్డ్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత విస్తరణ అత్యవసరమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, సీఎస్ఆర్ కార్యక్రమాలు కేవలం నిధుల కేటాయింపుకే పరిమితం కాకుండా సమాజంలో శాశ్వత మార్పులు తీసుకువచ్చేలా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు CSR కార్యక్రమాలు విస్తరించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో “మహబూబ్‌నగర్ ఫస్ట్” కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ పాఠ్యపుస్తకాలు, 2డీ, 3డీ యానిమేషన్ పాఠాలు, డిజిటల్ బోర్డులు, “లిటిల్ టీచర్”, “విద్యా వాలంటీర్” వంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతున్నాయని చెప్పారు. ఈ చర్యల ఫలితంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా “My Village School” వీడియో ప్రజెంటేషన్‌ను ప్రదర్శించగా, సమ్మిట్‌కు హాజరైన కార్పొరేట్ ప్రతినిధులు, విద్యావేత్తలు విశేషంగా స్పందించారు. ఇప్పటివరకు రెండు వేల ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించి, దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “గొప్ప పనులు ఒక్కసారిగా జరగవు… చిన్న చిన్న ప్రయత్నాలు కలిసివచ్చినప్పుడే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది” అని పేర్కొంటూ, నాణ్యమైన విద్య ప్రతి గ్రామీణ విద్యార్థికి అందేలా ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. “విద్య ఒక్కటే సమాజానికి శాశ్వత పరిష్కారం” అని నొక్కి చెప్పారు.
దేశంలో అభివృద్ధి ఫలితాలు ప్రతి వర్గానికి చేరినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన, మహబూబ్‌నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో CSR పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బాలికల విద్య, మహిళల నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలు సమాజంలో స్థిరమైన మార్పుకు దోహదపడుతున్నాయని తెలిపారు. “Creating Legacy – Enduring Impact & Systemic Transformation” అనే సమ్మిట్ థీమ్ దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా మారాలని సూచించిన ఆయన, CSR నిధులను వ్యవస్థాగత మార్పులకు వినియోగించాలని అన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే CSR కార్యక్రమాలు విజయవంతమవుతాయని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సేవా సంస్థలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి జ్ఞాపిక అందజేయగా, అనంతరం వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి కార్యక్రమాలను పరిశీలించారు.

