అదరగొట్టిన ఇషాన్.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!

క‌లం, వెబ్‌డెస్క్‌: జింబాబ్వే (Zimbabwe) పర్యటనలో టీమిండియా (India) తన విశ్వరూపం చూపించింది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan), తిలక్ వర్మల విధ్వంసక ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవగా, బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (8) త్వరగానే వెనుతిరిగినా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25) కాసేపు సహకారం అందించి నిష్క్రమించినా, ఇషాన్ బౌండరీల వర్షం కురిపించాడు.

ఇషాన్ కిషన్‌కు జతకలిసిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మైదానంలో పరుగుల తుఫాను సృష్టించాడు. మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో అజేయంగా 60 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (12), శివమ్ దూబే (6 నాటౌట్) వేగంగా ఆడటంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. జింబాబ్వే బౌలర్లలో బెన్నెట్, న్యామ్హురి, ముజారబాని, నగరవ, ఎవాన్స్ తలో వికెట్ పడగొట్టారు.

220 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు కనీస అవకాశం కూడా ఇవ్వలేదు. మొదటి నుంచి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచుతూ వరుసగా వికెట్లు నేలకూల్చారు. బ్రియన్ బెన్నెట్ (32), తదివనాషే మరుమని (24) మినహా మరెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. నాయకుడు సికందర్ రజా డకౌట్ కావడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది.

భారత బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్ల పండగ చేసుకున్నారు. స్పిన్నర్ అభిషేక్ శర్మ 2.5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లతో దెబ్బతీశాడు. యష్ ఠాకూర్ (2/30), ప్రిన్స్ యాదవ్ (2/10) చెరో రెండు వికెట్లతో మెరిశారు. రవి బిష్ణోయ్ (1/20), శివమ్ దూబే (1/13), తిలక్ వర్మ (1/9) తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>