కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని విద్యార్థులకు బకాయిపడిన 11 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju RaviChandra) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాకముందే వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని హెచ్చరించారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపివేస్తున్నాయని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు కూడా అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించని పక్షంలో, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ బకాయిలన్నింటినీ చెల్లిస్తుందని ఆయన (Vaddiraju RaviChandra) హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: నా ఇలాఖాలో మీ జోక్యమేంటి..? కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సామేల్ ఫైర్
Follow Us On : WhatsApp

