కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక సూచన చేశారు. రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట వేస్తే లాభం లేదని, ఇతర పంటలు వేసే దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో పర్యటించారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పని చేసే డాక్టర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అందుబాటులో ఉండే నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలని కోరారు. పండ్లు, కూరగాయలను ప్రోత్సహించాలన్నారు. ఇలాంటి పంటలతోనే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని అనుసరించాలని రైతులకు సూచించారు. సీడ్ బాల్స్ పద్ధతిని కూడా ఫాలో కావాలన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం కూడా రూపొందిస్తామన్నారు. విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా అందరం ఎదుర్కోవాలని సీఎం సూచించారు.
సీఎం అంటే సచివాలయంలో కూర్చొని సమావేశాలు నిర్వహిస్తారని, కానీ తాను అలాంటి సీఎం కాదని చంద్రబాబు అన్నారు. తాను కామన్ మ్యాన్ అని, ప్రజలతో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే, ప్రజల ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడా లేని కిక్ వస్తుందని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో మంచి, చెడులు అర్థం అవుతాయని, ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు.
Read Also: ముద్రగడ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం: బొండా ఉమ
Follow Us On : WhatsApp

