తెలంగాణలో బీజేపీ ‘యువ’ వ్యూహానికి జెన్ జీ స్ట్రోక్

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీకి (Telangana BJP) జెన్ జీ ఓటర్ల నుంచి భారీ షాక్ తగలనుందా? యువ ఓటర్లతోనే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీ పెద్దల లక్ష్యం బెడిసికొట్టనుందా! ఆరు రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో యువత చేస్తున్న ఆందోళనలు ఇక్కడి నేతలను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో పవర్‌లోకి రావడానికి పొలిటికల్ స్ట్రాటజీ వేసుకుంటున్న సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా వారిలో టెన్షన్ పుట్టిస్తున్నది. ఇదే అంశంపై పార్టీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

ఒకవైపు రాష్ట్రంలో యువత, విద్యార్థుల మద్దతును పొందడానికి బీజేపీ అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా ‘జెన్ జీ స్టూడెంట్స్ కాంక్లేవ్’ పేరుతో ప్రత్యేక సదస్సు పెట్టి లెక్చర్లు ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా స్టార్టప్లు, యువత అంటూ ప్రసంగాలు ఇచ్చారు. యువతకు అండగా ఉంటామని, యువ భారత్ అంటూ చెబుతూ వచ్చారు.

కానీ, తాజాగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో విద్యార్థులు, యువకులు ధర్నా చేసి ‘చలో సంసద్’ నిర్వహిస్తే భారీ స్థాయిలో లాఠీచార్జీ జరిగింది. దీంతో జెన్ జీ ఓటర్లపై ప్రేమ కురిపిస్తూనే.. మరోవైపు విరుచుకుపడడం ఏమిటని అర్బన్ యూత్‌ నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ నమ్మకం పెట్టుకున్న బీజేపీకి జంతర్ మంతర్ ఘటనతో నెగెటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఆ పార్టీ లీడర్లే కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం నుంచి బయటపడటం స్టేట్ బీజేపీకి సవాల్గా మారింది.

‘ఫీజు’ ఆందోళనలకు తాత్కాలిక బ్రేక్

తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, జాబ్ నోటిఫికేషన్ల పెండింగ్ అంశాలను అస్త్రాలుగా వాడుకోవాలని బీజేపీ భావించింది. ఇప్పటికే ఏబీవీపీ విద్యార్థులు సచివాలయం ముట్టడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ జంతర్ మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జి ఘటనతో విద్యార్థులతో ర్యాలీలు తీసే ప్రోగ్రామ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు లాఠీలతో సమాధానం చెప్పిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసే నైతిక అర్హత ఎక్కడిదనే ప్రశ్నలు ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న బీజేపీకి ఇప్పడిప్పుడే సానుకూల పరిస్థితి వస్తుందనుకున్న తరుణంలో జంతర్ మంతర్ ఘటనలతో కొత్త చిక్కులు వచ్చిపడ్డట్లయ్యాయి.

అర్బన్ ఓటు బ్యాంక్ ఆశలు గల్లంతేనా?

ప్రధాని మోదీ ఇమేజ్‌తో అర్బన్ ఓటు బ్యాంక్ పటిష్టంగా ఉందనుకున్న రాష్ట్ర బీజేపీకి ఊహించని సంకటం ఎదురవుతున్నది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున యువశక్తి, స్టార్టప్ అంటూ స్కై రూట్ కంపెనీ ప్రైవేట్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ గురించి ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇమేజ్‌నే రాష్ట్రంలో బీజేపీ వాడుకున్నది. కానీ ఇప్పుడు ప్రధానిపైనే జెన్ జీ యూత్ ఆగ్రహంగా ఉండడంతో ఆ ప్రభావం రాష్ట్ర బీజేపీపై ఏ మేరకు పడుతుందనే చర్చ మొదలైంది. జంతర్ మంతర్ వ్యవహారంలో బీజేపీకి జాతీయ స్థాయిలో జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునేంతవరకు తెలంగాణలో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగుల ర్యాలీలు చేపట్టడానికి బీజేపీకి కొన్ని చిక్కులు తప్పేలా లేవన్న వాదన వినిపిస్తున్నది.

మాటలకు, చేతలకు పొంతనేది?

“ఈ దేశంలోని యువత, జెన్ జీ వర్గాలు నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, దేశ నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తారు.. ‘యాంటీ-ఎస్టాబ్లిష్‌మెంట్ మైండ్‌సెట్’తో ఉండరు.. రాజ్యాంగాన్ని సవాలు చేసే ధోరణి కనిపించదు..” అని హైదరాబాద్‌లో ‘జెన్ జీ కాంక్లేవ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కనిపించే ‘30 సెకన్ల రీల్స్’ ప్రపంచంలో కాకుండా వాస్తవికత ఆధారంగా యువత నిర్ణయాలు తీసుకోవాలని సూచన చేశారు. జెన్-జీ గురించి గొప్పగా చెప్పిన బీజేపీ.. చివరకు జంతర్‌మంతర్‌లో అదే యువతపై లాఠీచార్జి చేయడం ఇక్కడి యువతను కూడా డైలమాలో పడేసింది. దీనికి తోడు ప్రశ్నించేవారిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని, దేశద్రోహులు అని, అర్బన్ నక్సల్స్ అని, టెర్రరిస్టులు అని, ఫారెన్ ఫండింగ్‌తో జరుగుతున్న ఆందోళన అంటూ ఇక్కడి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి.

జెన్ జీ ప్రశ్నలకు సమాధానాలు కరువు :

జంతర్ మంతర్ ఘటనను అన్ని నగరాలు, రాష్ట్రాల్లోని యూత్ తీవ్రంగా ఖండించారు. సినీ నటులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా లాఠీచార్జీని, కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. హక్కుల కోసం, న్యాయం కోసం గొంతెత్తితే అణచేస్తారా అంటూ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించకపోగా న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తున్న యువతను ‘ట్రబుల్ మేకర్స్’గా, ‘సంఘ వ్యతిరేక శక్తులు’గా ముద్ర వేసి లాఠీలతో కొట్టించడమేనా జెన్ జీకి బీజేపీ ఇస్తున్న గౌరవం అని తెలంగాణ విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు నిలదీస్తున్నారు. వీటికి బీజేపీ నుంచి జవాబులు కరువయ్యాయి.

గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో జాప్యం, పేపర్ లీకేజీల కారణంగానే అప్పటి ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడ్డారు. అధికారం నుంచి దించేశారు. ఇప్పుడు బీజేపీకి జెన్ జీ భయం పట్టుకున్నదన్న మాటలు వినిపిస్తున్నాయి. జరిగిన డ్యామేజ్‌ను ఆ పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుంది.. తిరిగి జెన్ జీ యూత్ విశ్వాసాన్ని ఎలా చూరగొంటుంది.. అప్పటివరకు రాజకీయంగా లాంటి ప్రభావం పడుతుంది.. ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>