కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూలు (Nagarkurnool) నియోజకవర్గం తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంతా కేశవ పాటిల్ పరిశీలించారు . ప్రస్తుతం చేపడుతున్న పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలు, పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల భవన సముదాయంలోని విద్యార్థుల తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల, వంటశాల, పరిపాలనా విభాగం, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు, అంతర్గత రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, ప్రహరీ గోడ తదితర నిర్మాణ పనులను వివరాలతో ప్రభుత్వం రూపొందించిన మ్యాపును పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయా? లేదా? అనే అంశాలను స్వయంగా పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ… గురుకుల విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యాసంస్థలను నిర్మిస్తోందన్నారు. నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పనిని ఇంజినీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
శాసనమండలి సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. తూడుకుర్తిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవనం పూర్తయిన తర్వాత విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు ఒకేచోట లభిస్తాయని. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన పనులను పరిశీలించారు. ప్రీ ప్రాథమిక పాఠశాల తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక హోటల్స్ సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.

