ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో బీజేవైఎం తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రీయింబర్స్ మెంట్ బకాయిల (Fee Reimbursement Dues) విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బీజేపీ యువమోర్చా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనుందని చెప్పారు. ప్రతి రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి చెల్లించి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని రాంచందర్ రావు (Ramchander Rao) అవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు తెలంగాణలో నమోదవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఉద్యోగాలు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే విద్యార్థుల న్యాయమైన హక్కు కోసం బీజేపీ యువమోర్చా ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందని వివరించారు.

ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ విద్యార్థులందరూ ఒక్కటిగా ముందుకు రావాలని రాం చందర్ రావు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే ఈ న్యాయపోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీజేవైఎం, మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ఏకం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై బీజేపీ విస్తృత ఉద్యమాన్ని నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.

Read Also: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. పాడ్ ట్యాక్సీ వచ్చేస్తోంది!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>