కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పార్టీకి, ప్రజలకు మధ్య కీలకమైన వారధిగా పనిచేసే బాధ్యతగా ప్రభుత్వ విప్ పదవిని భావిస్తున్నానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మంత్రి హోదా కల్పించిన సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, వివిధ సంఘాల నాయకులు కలిసి బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యెన్నం మాట్లాడుతూ.. విప్ పదవి ద్వారా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని తెలిపారు. ప్రజలతో పార్టీకి మధ్య బలమైన అనుసంధానంగా ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తనకు మంత్రి హోదా కల్పించినప్పటికీ, విప్ పదవి పూర్తి స్థాయి క్యాబినెట్ మంత్రి హోదాతో భిన్నమైనదని ఆయన స్పష్టం చేశారు.
క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వ విధానాల నిర్ణయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని.. విప్, సహాయ మంత్రులు ఆ సమావేశాల్లో పాల్గొనకపోయినా, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజా సేవలో సమాన బాధ్యత వహిస్తారని వివరించారు. విప్‌గా తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని పేర్కొంటూ, పార్టీని బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీకి మద్దతు పెంపొందించడం, ఎమ్మెల్యేలందరిని సమన్వయం చేయడం, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచి, మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తనకు అత్యంత ప్రాధాన్యతనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఈ గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం హన్వాడ మండలానికి చెందిన కావలి సిద్దార్థ నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో 465 మార్కులు సాధించిన సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మైత్రి యాదయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, తులసి రాం నాయక్, కేశవులు, తుప్పలి ఆంజనేయులు, బొక్కి రాములు, కావాలి శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామాల అధ్యక్షులు, వాగ్దేవి జూనియర్ కళాశాల డైరెక్టర్ విజేత వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

