పప్పులు vs గుడ్లు.. ప్రొటీన్ కోసం ఏది బెస్ట్?

కలం, వెబ్‌ డెస్క్: శరీర దారుఢ్యానికి, కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రోటీన్ అత్యవసరమైన పోషకం. మన దైనందిన ఆహారంలో ప్రొటీన్ అనగానే మనకు మొదటగా పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు గుర్తొస్తాయి. అయితే పప్పులు vs గుడ్లు (Dal vs Eggs) ఈ రెండింటిలో దేనిలో ఎక్కువగా ప్రొటీన్ ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ అనేది మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన పోషకం. ఇది కండరాల పెరుగుదలతో పాటు కణజాలాల మరమ్మతు, హార్మోన్ల సమతుల్యతకు కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఎముకలు, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రోటీన్ అవసరమని చెబుతున్నారు నిపుణులు.

పప్పు, గుడ్డు రెండింటిలోనూ ప్రోటీన్ ఉన్నప్పటికీ.. ప్రోటీన్ తో పాటు అదనపు పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. గుడ్డులో శరీరానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. మరోవైపు పప్పులలో ప్రోటీన్ తో పాటు అధిక మోతాదులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రొటీన్ పరిమాణం, దాని నాణ్యత, శోషణ పరంగా చూసినప్పుడు ఏది బెస్ట్ అనే చర్చ జరుగుతుంది.

సుమారు 150-200 గ్రాముల వండిన పప్పులో 8 నుంచి 12 గ్రాముల ప్రొటీన్ లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అయితే పప్పు రకాన్ని బట్టి ప్రొటీన్ పరిమాణం మారుతుందట. మరోవైపు ఒక పెద్ద గుడ్డు(సుమారు 50 గ్రాములు)లో 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుందని చెబుతున్నారు.

పప్పులు vs గుడ్లు.. ఏది బెస్ట్?

ప్రొటీన్ పరిమాణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, ఒక పెద్ద గిన్నెడు ఉడికించిన పప్పులో, ఒక కోడిగుడ్డు కంటే ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ లభిస్తుందని చెబుతున్నారు. కానీ నాణ్యత పరంగా చూసినప్పుడు గుడ్డులో ఉండే ప్రొటీన్లు మెరుగైనవిగా చెబుతారు. ఎందుకంటే శరీరానికి అవసరమైన 9 రకాల ఆవశ్యక అమైనో ఆమ్లాలు గుడ్డులో సరైన నిష్పత్తిలో ఉంటాయట. అంతే కాకుండా గుడ్డులో ఉండే ప్రొటీన్ ను శరీరం సులభంగా, వేగంగా గ్రహిస్తుందని చెబుతున్నారు.

మరోవైపు, పప్పులలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో కొవ్వులు ఉండవు. పైగా పప్పుల ద్వారా శరీరానికి ఎంతో మేలు చేసే పీచు పదార్థం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు, మొక్కల ఆధారిత పోషకాలు సమృద్ధిగా అందుతాయని చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు ఎంతో సహాయపడతాయి. అందువల్ల, కండరాల పుష్టిగా ఉండేందుకు, వేగవంతమైన ప్రొటీన్ శోషణ కోసం గుడ్డు మంచిదైతే, సమగ్ర శారీరక ఆరోగ్యం, పీచు పదార్థం కోసం పప్పులు ఉత్తమమైనవి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>