అశ్వారావుపేటలో ఉద్రిక్తత.. పీ‌ఎస్‌ను ముట్టడించిన గిరిజనులు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల తీరు తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ సర్పంచ్ మడకం నాగేశ్వరరావుకు చెందిన పట్టా భూమిలో సాగు చేసిన కంది పంటను అటవీ సిబ్బంది రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం ఏజెన్సీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ​

బాధిత రైతు, స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్న ప్రకారం.. సర్పంచ్ మడకం నాగేశ్వరరావు తన సొంత పట్టా పొలంలో భారీ పెట్టుబడులు పెట్టి కంది పంటను సాగు చేశారు. సరిగ్గా పంట చేతికొచ్చే దశకు చేరుకున్న తరుణంలో, అటవీశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో సిబ్బందితో వచ్చి సుమారు 4 ఎకరాల పంటను పూర్తిగా ధ్వంసం చేశారు.
​
​అటవీశాఖ అధికారుల ఏకపక్ష చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామన్నగూడెం గ్రామానికి చెందిన సుమారు 200 మంది గిరిజన రైతులు, మహిళలు బుధవారం మూడు ట్రాక్టర్లలో భారీగా తరలివచ్చి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులపై అటవీశాఖ సిబ్బంది సాగిస్తున్న వేధింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అన్నదాతల కష్టాన్ని ఆవిరి చేసిన సంబంధిత అటవీ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, పంట నష్టపోయిన బాధిత రైతుకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు.​ పోలీసులు స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గిరిజనులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ ఘటనతో అశ్వారావుపేట ప్రాంతంలో పోడు, పట్టా భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>