కలం, ఖమ్మం బ్యూరో: గిరిజనులపై అణచివేతలను ఎదుర్కొనేందుకు, వారి హక్కుల సాధనకు అంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) పిలుపునిచ్చారు. శనివారం పాల్వంచలో జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) రాష్ట్ర మహాసభల బహిరంగ సభలో కూనంనేని ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
గిరిజనులపై అక్రమ కేసులు..
తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని కూనంనేని మండిపడ్డారు. పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన సబ్ ప్లాన్ నిధులను ఇతర రంగాలకు మళ్లించడాన్ని తక్షణమే ఆపాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం తాము శాసనసభ లోపలా, వెలుపలా గొంతుకగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఉపాధి హామీ పథకం నిర్వీర్యం..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శిస్తూ, వలసల నివారణకు పనిదినాలను 200 రోజులకు పెంచాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో దేశవ్యాప్త ఆదివాసీలను ఏకం చేసి పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు అజ్మీరా రామ్మూర్తి నాయక్, రమావత్ అంజయ్య నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ, గిరిజన సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

