కలం, నల్లగొండ బ్యూరో: మంత్రి పదవుల భర్తీ, విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు రాజగోపాల్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. “నాకు పదవులు అడుక్కోవడం తెలియదు.. ప్రజల కోసం కొట్లాడటమే తెలుసు” అని స్పష్టం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నన్ను ఓడించేందుకు వంద మంది ఎమ్మెల్యేలు..
“నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే, నన్ను ఓడించడానికి నా నియోజకవర్గానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నేను సోదరులమే కావచ్చు.. కానీ మా కుటుంబాలు వేర్వేరు” అని స్పష్టం చేశారు.
మంత్రి పదవి విషయంలో వెంకట్‌రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనకు పదవి రావడం వల్ల తనను పక్కన పెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
వారికే మంత్రి పదవులు వచ్చాయి..
ఎన్నికల సమయంలో, ఆ తర్వాత అధిష్ఠానం ఎవరికైతే ముందస్తుగా హామీలు ఇచ్చిందో, వారికే ఇప్పుడు మంత్రి పదవులు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. “అధిష్ఠానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి.. కానీ, నాకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదు” అని అసంతృప్తిని బయటపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సీనియర్ నేతగా, మునుగోడులో గట్టి పట్టున్న నాయకుడిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను అధిష్ఠానం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందో, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోననే చర్చ జరుగుతోంది.

