కలం, వెబ్ డెస్క్: దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి జులై 14 వరకు 554 మంది భర్తలు చనిపోయినట్లు (Husbands Died) గురుగ్రామ్‌కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇటీవల కాలంలో హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలపై ఒక స్టడీ నిర్వహించింది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
హత్యలే ఎక్కువ..
చనిపోయిన 554 మందిలో 322 మంది భార్యలు, వారి ప్రియుల చేతిలో హత్యకు గురైనట్లు ఫౌండేషన్ నివేదిక పేర్కొంది. మిగిలిన 232 మంది దాంపత్య జీవితంలో విబేధాలు, గృహ హింస, మానసిక ఒత్తిడి, ఉద్యోగ వాపారాల్లో ఇతరత్ర సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. రోజుకు సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుంటే, ఒకరి కంటే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
జాబితాలో తెలంగాణ..
భర్తలు ఎక్కువగా చనిపోతున్న జాబితాలో తెలంగాణ కూడా ఉన్నట్లు నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఈ తరహా మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది. మొత్తం దేశ వ్యాప్తంగా చూసినప్పుడు 196 మంది హత్యలు, ఆత్మహత్యల వంటి ఘటనలతో యూపీ మొదటి స్థానంలో నిలిచింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. తాము మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే రిపోర్ట్ రెడీ చేసినట్లు ఏకం న్యాయ్ ఫౌండేషన్ తెలిపింది. దీన్ని అధికారిక గణాంకాలుగా స్వీకరించవద్దని కోరింది.

