కలం, వెబ్ డెస్క్ : జంతర్ మంతర్ వేదికగా గత 21 రోజులుగా సాగుతున్న ప్రముఖ సామాజిక విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష ను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. 21 రోజులుగా కేవలం ఉప్పు నీటితోనే సాగుతున్న ఈ సుదీర్ఘ దీక్ష కారణంగా వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్య అధికారుల సూచన ప్రకారం.. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు వాంగ్‌చుక్ ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ చర్యలను ఆయన మద్దతుదారులు, విద్యార్థి సంఘాల నాయకులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది.
దీక్షకు కారణం ఏమిటి?
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు దిగారు. తన శరీరం నీరసించినా, ఆశయం బలంగా ఉందని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సామాన్యుల నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయన చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను భగ్నం చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకముందే పోలీసులు ఈ దీక్షను భగ్నం చేయడంపై విపక్షాలు, సామాజిక శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

