బహదూర్‌గూడలో హై టెన్షన్ : భారీగా మోహరించిన పోలీసులు!

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ (Bahadurguda) గ్రామం ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 650 ఎకరాల భూములను సేకరించేందుకు హైడ్రా అధికారులు, రెవెన్యూ బృందాలు భారీగా రంగంలోకి దిగడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూములను ఇచ్చేందుకు రైతులు తెగేసి చెప్పడంతో గడిచిన ఐదు రోజులుగా ఇక్కడ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

ప్రభుత్వం నుంచి సరైన నష్టపరిహారం, పునరావాసంపై స్పష్టమైన, లిఖితపూర్వక హామీ లభించిన తర్వాతే భూములను అప్పగిస్తామని, అంతవరకు ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం అక్రమంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. నిరసన తెలుపుతున్న రైతులకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.

పరిస్థితి చేదాటిపోకుండా తెల్లవారుజాము నుంచే సుమారు 1,200 మంది పోలీసులను బహదూర్‌గూడ గ్రామ పరిసరాల్లో మొహరించారు. నిరసనకారులను, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధిస్తుండటంతో వ్యవసాయ క్షేత్రాలు పోలీస్ వలయంగా మారిపోయాయి. అధికారుల దూకుడు, పోలీసుల మోహరింపుతో శంషాబాద్ పరిధిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>