కలం, దేవరకొండ: నాట్లు వేసే దశలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండటంతో సాగు పనుల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ (Ramavath Ravindra Kumar) డిమాండ్ చేశారు. శుక్రవారం పీఏ పల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
పీఏ పల్లి, గుడిపల్లి ఉమ్మడి మండలాల్లో కొనసాగుతున్న విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేసి, నిరంతర సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ ముందస్తు సమాచారం లేకుండా తరచూ సరఫరాను నిలిపివేస్తోందని మండిపడ్డారు.
తాగునీరు అందక అవస్థలు..
కరెంట్ లేక మోటార్లు నడవక, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయంపైనే కాకుండా గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ పైనా ప్రభావం పడుతోందని తెలిపారు. కరెంట్ కోతలతో పంపింగ్ నిలిచిపోయి ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.
విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి 24 గంటల పాటు అంతరాయం లేని విద్యుత్‌ను అందించాలని కోరారు. విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయకపోతే.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

