కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు కామాంధులు బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఓ బాలికతో అదే గ్రామానికి చెందిన యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమెను నమ్మించి, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు.
అందరికీ చెబుతానంటూ మరొకడు..
ఈ విషయం అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి తెలిసింది. అండగా నిలవాల్సింది పోయి, రాక్షసుడిలా మారాడు. జరిగిన విషయాన్ని అందరికీ చెప్పేస్తానంటూ సదరు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. భయాందోళనలతో ఉన్న ఆ చిన్నారిని పూర్తిగా లొంగదీసుకుని రెండో యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుల వేధింపులు భరిస్తూ వచ్చిన ఆ బాలిక ఇటీవల గర్భం దాల్చింది. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో నిందితుల ఘాతుకాలను కన్నీరుమున్నీరవుతూ వివరించింది.
పోక్సో కేసు నమోదు..
వెంటనే తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అమానుష ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామాంధులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: జానీ మాస్టర్‌కు ఊహించని షాక్
Follow Us On: Instagram

