కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) సీరియస్ అయ్యారు. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కౌకుంట్ల మండలంలోని పుట్టపల్లి, పేరూరు గ్రామాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పుట్టపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి, అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలు తెలుసుకోవడంతోపాటు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.
అనంతరం పుట్టపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని (Puttapalli Anganwadi Center) సందర్శించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం పేరూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్ సిబ్బంది వివరాలు, రోజువారీ పరీక్షల సంఖ్య, సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పేరూరులోని పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి పశువులకు అవసరమైన మందులు, టీకాలు అందిస్తున్నారా లేదా పరిశీలించారు.
పేరూరు అంగన్‌వాడీ 3 కేంద్రంలో చిన్నారులకు అన్నం, నీళ్ల చారు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే కేంద్రంలో పరిశుభ్రత లోపాలను గుర్తించారు. సంబంధిత అంగన్‌వాడీ టీచర్, ఆయాపై విధుల పట్ల నిర్లక్ష్య వైఖరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి కూడా షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు.
చివరిగా పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, మండలాధికారులు ఉన్నారు.
చిన్నచింతకుంట మండలంలో ముమ్మర పర్యటన
చిన్నచింతకుంట మండలంలో ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), దమగ్నాపూర్‌లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా చిన్నచింతకుంట మండలంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఆర్.బి.ఎస్.కె కార్యక్రమం కింద వైద్య బృందం నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దమగ్నాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో అందుబాటులోకి తీసుకురావాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచందర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, మండల, గ్రామ అధికారులు ఉన్నారు.
Read Also: ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

