కలం, ఖమ్మం బ్యూరో: చేపల వేట అనగానే సాధారణంగా వలలు విసరడం, గాలాలు వేయడం లేదా నీటిలో గంటల తరబడి శ్రమించడం చూస్తుంటాం. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం స్థానికులు ఎవరూ ఊహించని విధంగా అత్యంత సులువైన, వినూత్నమైన పద్ధతిలో చేపలు పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎటువంటి ఖర్చు, పెద్దగా శ్రమ లేకుండా కేవలం ఇంట్లో ఉండే చీరల సహాయంతో కుప్పలు కుప్పలుగా చేపలను పడుతూ (Saree Fishing) లక్ పరీక్షించుకుంటున్నారు.
ఖమ్మం (Khammam) జిల్లా ఏనుకూరు మండలం తిమ్మరావు పేట వద్ద ఈ ఆసక్తికరమైన దృశ్యం వెలుగుచూసింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ ఎస్ పి) ప్రధాన కాలువ నుంచి వైరా జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తిమ్మరావు పేట వద్ద ఉన్న ఎస్కేప్ తూము నుంచి నీరు అత్యంత ఉధృతంగా కిందకు ప్రవహిస్తోంది. ఈ ఉధృతమైన నీటి ప్రవాహంతో పాటు పెద్ద సంఖ్యలో చేపలు కూడా కొట్టుకు వస్తున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు ఒక వినూత్న ఉపాయాన్ని ఆలోచించారు.
కట్టుకునే చీరలను తీసుకొచ్చి, నీరు ఉధృతంగా పడే చోట ఊయల మాదిరిగా గట్టిగా కట్టారు. అంతే.. కాలువ ప్రవాహ వేగానికి కొట్టుకువస్తున్న చేపలు నేరుగా గాల్లోంచి వచ్చి ఆ చీరల ఊయలలో పడిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు, స్థానిక యువకులు ఎటువంటి శ్రమ లేకుండా, కేవలం ఆ చీరలను పైకి లాగి చేపలను సులభంగా బుట్టల్లో వేసుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాటు చేపలు నేరుగా వచ్చి చీరల్లో పడుతుండటంతో ఈ వింత వేటను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం తిమ్మరావు పేట వద్ద స్థానికులు అనుసరిస్తున్న ఈ దేశీ చేపల వేట ఐడియా సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

